16 July, 2026 | 10:39 AM

కాంగ్రెస్‌ది ఆటోపైలట్ ప్రభుత్వం

04-07-2024 01:37 AM

చర్చించే దమ్ములేక విపక్షాలు తోకముడిచాయి

వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ అధికారంలోకి వచ్చాం

మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటాం

బెంగాల్ మూకదాడిపై విపక్షాల స్పందనేది?

రాజ్యసభలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 3: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ సహా విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని విమర్శిస్తూ యూపీఏ హయాంలో ఆటోపైలట్, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాలను నడిపారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఆటోపైలట్ వ్యవస్థను నడిపించారు. వాళ్లకు పని చేయడంపై నమ్మకం లేదు. వాళ్లు ఎన్డీయేను ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా మళ్లీ తిరిగి వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టాం. మాపై ప్రజలు చూపిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి విభజన అజెండాను ఓడించారు. ఓ కాంగ్రెస్ నేత మాది మూడో వంతు ప్రభుత్వమని విమర్శించారు. నిజమే.. ఇప్పటికే పదేళ్ల పాలన పూర్తి చేసుకున్నాం. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాం అన్నారు. 

మణిపూర్ శాంతిస్తోంది

రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను మోదీ తిప్పికొ ట్టారు. రాజ్యాంగం అంటే కేవలం నిబంధనలనే కాదని, అది లైట్‌హౌస్‌లాగా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. మణిపూర్ అంశంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్‌పై మోదీ స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అక్కడ జరిగిన అల్లర్లపై 11 వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, 500కుపైగా ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటున్నాయని తెలిపారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సార్లు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారని మోదీ గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు చేయడం ఆపేయాలన్నారు.

మూకదాడి, నీట్‌పై స్పందన

బెంగాల్ మూకదాడి ఘటనపై స్పందిస్తూ  నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొడుతున్నా ఆ అన్యాయాన్ని అందరూ కళ్లు అప్పగించి చూశారే తప్ప ఆ సాయం చేసేందుకు ఎవరూ  ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయన్నారు. నీట్ అంశాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారని మోదీ గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై చర్చ జరగాలని, కానీ, ప్రతిపక్షాలు యువత భవిష్యత్తుపై రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. 

భయపడి పారిపోయారు 

మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష ఎంపీలు అడ్డుతగిలారు. అయితే, వారు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మోదీ, రాజ్యసభ చైర్మన్ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంపీలు ఇలా చేయడం సరికాదని, ఇది సభను అవమానించడమేనని పేర్కొన్నారు. నిజాలు చెబుతుంటే వాళ్లు భరించలేకపోతున్నారని దుయ్యబట్టారు. చర్చలో పాల్గొనే దమ్ము లేక పారిపోయారని ఎద్దేవా చేశారు. సమాధానం వినే ధైర్యం లేని సభ్యులు ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని చురకలంటించారు.