అప్పుడు.. ఇప్పుడు అధికార పక్షమే..!
బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్
బల్దియాలో బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్
ఈ నెల 6న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లోనూ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రేటర్‌లో సత్తా చాటిన బీఆర్‌ఎస్, పార్లమెంటు ఎన్నికల్లో చతికిలపడింది. ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. దీంతో, జీహెచ్‌ఎంసీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రేటర్‌లో కేవలం ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే కలిగి ఉన్న అధికార కాంగ్రెస్.. ప్రత్యక్ష కార్యచరణలోకి దిగకుండానే పరోక్షంగా తన బలం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
అవిశ్వాసానికి నో ఛాన్స్..!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. దీంతో, వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ హాయాంలోనూ వీరి ద్దరూ మేయర్, డిప్యూటీ మేయర్‌లుగానే కొనసాగుతున్నారు.ఈ నెల 6వ తేదీన జరగనున్న బీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి మేయర్, డిప్యూ టీ మేయర్లు ఇద్దరూ కాంగెస్ పార్టీ నేతలుగా సభ్యుల ఎదుట హాజరుకానున్నారు.
బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్
వాస్తవానికి జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే, ప్రభుత్వం మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్‌తో సహా మరికొంత మంది బీఆర్‌ఎస్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ సుమారు 20 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని, తమని కూడా ప్రోటోకాల్ జాబితాలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ కార్యదర్శికి లేఖ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ వీడిన మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాణం పెట్టాలంటే.. మేయర్ పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావాల్సి ఉంది. దీనికి మరో ఏడాది సమయం ఉన్నందున అప్పటి దాకా వలసలు కొనసాగవచ్చు. ఒకవేళ అవిశ్వాస తీర్మాణం కౌన్సిల్ ముందుకు రావాలంటే ఫిర్యాదు చేసిన దగ్గర్నుంచి నెలరోజులకు పైగానే ప్రక్రియ పట్టనుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కూడా అవిశ్వాసం ఎజెండాను లేవనెత్తే పరిస్థితులు కన్పించడం లేదు.






