27 July, 2026 | 5:36 PM

200 సీట్లు కూడా రావు

29-05-2024 12:31 AM

న్యూఢిల్లీ, మే 28: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి, ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్పుకోవడం అర్థరహితమని, 200 సీట్లు వస్తే అదే గొప్ప అని జోస్యం చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని కాంగ్రెస్, ఇండియా కూటమి పై చేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీ సీట్లు తగ్గుతాయి. మా సంఖ్య పెరుగుతుంది.

బీజేపీకి 400 సీట్లు రావడం పక్కకు పెట్టండి.. ఇదో శుష్క వాదన. వాళ్లు కనీసం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేరు. 200 సీట్లు కూడా దాటవు’ అని ఖర్గే అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ అసలు లేదని, కర్ణాటకలో బీజేపీకి అంతగా బలం లేదని స్పష్టం చేశారు. ‘మహారాష్ట్రలో మీరు చాలా బలహీనం. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇక 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతే ఖర్గే ఉద్యోగం (కాంగ్రెస్ చీఫ్‌పదవి) తీసేస్తారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శలపై స్పందిస్తూ..

‘నేను ఉద్యోగం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నా చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్నాను. ప్రధాని మోదీ వయసు ఎంత ఉంటుందో అన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ముందు జూన్ 4 తర్వాత మీ జాబ్ గురించి ఆలోచించుకోండి’ అని దుయ్యబట్టారు. 

జీఎస్టీ సరళతరం చేస్తాం..‘ఇండియా’ అధికారంలోకి వస్తే.. 

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీఎస్టీని సరళతరం చేస్తామని, వ్యవసాయ పనిముట్లను జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తామని ఖర్గే ప్రకటించారు. పంజాబ్ యువతలో నైరాశ్యం ఆవహించిందని, యువత మత్తుకు బానిసలు కావడం పంజాబ్ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులాంటిదని దుయ్యబట్టారు. మత్తు కారణంగా పంజాబ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోందని మండిపడ్డారు. తప్పుడు జీఎస్టీ, పెద్ద నోట్ల ఉపసంహరణ కారణంగా పంజాబ్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.