29 April, 2026 | 3:23 AM

టీఆర్పీలో కాంగ్రెస్ నేత చేరిక

29-04-2026 01:44 AM

ఆ పార్టీకి రాజీనామా చేసిన యూత్ స్టేట్ సెక్రటరీ పూజిత

హైదరాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): కాంగ్రెస్‌కి చెందిన యూత్ స్టేట్ సెక్రటరీ పూజిత ఆ పార్టీకి రాజీనామా చేసి, నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో అధికారికంగా చేరారు. ఈ కార్యక్ర మం బత్తిని మీనా ఆధ్వర్యంలో నిర్వహించారు.టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూజితకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలుస్తోందన్నారు.

సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి, బీసీ రాజ్యాధికార సాధన లక్ష్యాలతో పనిచేస్తున్న టీఆర్పీ సిద్ధాంతాలు తనను ఆకర్షించాయని తెలిపారు.ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీఆర్పీ అధినేత తీన్మార్ మాట్లాడుతూ పూజిత వంటి యువ నాయకుల చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువత టీఆర్పీ వైపు ఆకర్షితులవుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పార్టీ నాయకులు ఆమె చేరికను స్వాగతిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొని, సంస్థ బలోపేతానికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.