29 April, 2026 | 2:59 AM

ప్రపంచ పటంలో ఫ్యూచర్ సిటీ

29-04-2026 01:44 AM
  1. మనందరం కలిస్తేనే ఈ నగరం నిర్మాణం
  2. రైతులు భూములు ఇచ్చి సహకరించాలి
  3. వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది
  4. జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం
  5. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌రేట్ నిర్మాణ భూమి పూజలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రపంచంలోనే మేటి నగ రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొ న్నారు. ఫ్యూచర్ సిటీ కోసం స్థానిక రైతులు భూములు ఇచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆనందంగా పరిహారం తీసుకోవాలని, మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో కలిసిన రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన, మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగారేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి రైతుల్లో అభ ద్రతా భావం లేకుండా అధికారులు భూ సేకరణ చేపట్టాలని, అభివృద్ధి కోసం భూము లిచ్చే రైతులను అధికారులు గౌరవించాలని సూచించారు. తమ గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని కొంతమంది తన వద్దకు వచ్చి విజ్ఞప్తిచేశారని, గ్రామసభ లు నిర్వహించి తీర్మానం చేయించి ఆ గ్రా మాలను వారి కోరిక మేరకు కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఇక్కడ భూమిలిచ్చిన రైతులు, మరోచోట భూమి కొనుగో లు చేసేలా డబ్బులు ఇస్తామని తెలిపారు.

సమస్య పరిష్కారానికి అందుబాటులో మంత్రి శ్రీధర్‌బాబు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుం టుందని, మీ సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీధర్‌బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూ చిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మీరు సహకరిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అద్భుత నగర నిర్మాణానికి వేగం గా అడుగులు పడతాయని వెల్లడించారు.

ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఫ్యూచర్ సిటీని అద్భుత నగరంగా అభివృద్ధి చేసుకుందామని, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జూన్ 2 లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందామన్నారు.

ఇక నుంచి ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిద్దామని తెలిపారు. నాడు ఔటర్ రింగురోడ్డు నిర్మించేటప్పుడు ఇది అయ్యేది కాదని చాలా మంది అనుకున్నారని, కానీ, 160.500  కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డు దేశంలో ఏ నగరానికీ లేదని చెప్పారు.

ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి..

ఫ్యూచర్ సిటీ నిర్మానంలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల సర్పంచ్‌ల వివరాలు తెప్పించుకొని, వారికి ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పాస్ పంపించాలని అధికారులకు సూచించారు. ప్యూచర్ సిటీ నిర్మాణం అంత సుల భం కాదని, అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఇది భవిష్యత్ తరాల నగరమని వెల్లడించారు.

మూడు బుల్లెట్ ట్రైన్లు మన రాష్ట్రానికే.. 

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్స్ మంజూరు చేస్తే, వాటిలో మూడు మన రాష్ట్రానికే వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. బెంగుళూరు- -హైద రాబాద్, శంషాబాద్- పుణె, శంషాబాద్- అమరావతి-- చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్‌కు మార్గం సుగమమైందన్నారు. రంగారెడ్డి జి ల్లాలో అద్భుతం జరగబోతుందని, అది అందరూ సహకరిస్తేనే ఆవిష్కృతమవుతుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచాలని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

మిగిలిన వారూ జనజీవన స్రవంతిలో కలవండి..

‘ఈ వేదికగా మావోయిస్టులకు పిలుపునిస్తున్నా.. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి.. మీ ఆరోగ్యం, మీకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గిరి దర్శక్ కార్యక్రమంలో భాగంగా 20 మంది గిరిజన యువకులకు నియామక పత్రాలు సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. పర్యాటక అభివృద్ధితోపాటు గిరిజన యువతకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో గిరి దర్శక్ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గిరిదర్శక్‌ల నియామకం జరిగిందని, ఎంపిక చేసి శిక్షణ అందించిన గిరి దర్శక్‌లు పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారని తెలిపారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతోపాటు పర్యాటకుల భద్రతను గిరి దర్శక్‌లు  కల్పించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వాళ్ల ఏడుపు నాకు వినసొంపుగా ఉంది..

మేం అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారని, వారు ఏడుస్తూనే ఉండాలని, తా ము అభివృద్ధి చేసుకుంటూ ముం దుకు వెళతామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రాక్షసుల కుల గురువు శుక్రా చార్యుడు.. దేవతలు యజ్ఞాలు చేస్తుం టే మారీచుడు, సుబాహుడును పంపి భగ్నం చేయాలని ప్రయత్నించేవారని, అదేవిధంగా రాష్ట్రంలో కూ డా ఫామ్ హౌస్‌లో ఉన్న శుక్రాచార్యు డు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సునాహుడిని పంపాడని, వాళ్లు జనంలో తిరు గుతూ విషం చిమ్ముతున్నారని, వాళ్ల మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి విమర్శించారు.

అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఇవాళ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. అధికారం కోల్పోయిన బాధలో వాళ్లు అసూయతో ఏడుస్తుంటే తన చెవులకు అది విన సొం పుగా ఉందని వ్యాఖ్యానించారు.