సింగూరు నీటిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలు
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్
కొల్చారం, మార్చి 31: సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు రావాల్సిన నీటిని స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ప్రభుత్వం అడ్డుకుంటోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్చి 23న 0.3 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేసినా, ఇప్పటి వరకు నీటి విడుదల జరగకపోవడం వెనుక కాంగ్రెస్ నేతల ఒత్తిడే కారణమని ఆరోపించారు.
మంగళవారం కొల్చారం మండలం తుక్కాపూర్ వద్ద రైతులతో కలిసి ఎండిపోయిన మంజీరా నదిని పరిశీలించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంజీరా తీర గ్రామాలు, ఘనపూర్ ఆయకట్టు కింద సాగు చేసిన లక్షల ఎకరాల వరి పంటలు నీటి కోసం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి, వడ్డీలకు డబ్బులు తెచ్చి పంటలు సాగు చేస్తే ప్రభుత్వం మాత్రం చుక్కనీరు ఇవ్వకుండా చేతులు ముడుచుకుని కూర్చుందని విమర్శించారు.
అసెంబ్లీలో ప్రశ్నించాకే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, కానీ స్థానిక కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొగ్గి అమలు చేయడం లేదన్నారు. రైతుబంధు డబ్బులు ఇవ్వలేదు, పంట బీమా లేదు, ఇప్పుడు కనీసం నీరు కూడా ఇవ్వకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.గతంలో కేవలం మూడు టీఎంసీల నీరు ఉన్న సమయంలో కూడా రైతుల పంటల కోసం నీరు విడుదల చేశారని, ఇప్పుడు సింగూరులో తొమ్మిది టీఎంసీల నీరు ఉన్నా రైతుల పంటలు కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ నాయకుల రాజకీయ కక్షలకు రైతుల పంటలను బలి చేస్తున్నారని ఆరోపించారు.మంజీరాలో చుక్క నీరు లేక రైతులు గుంతలు తవ్వి, మోటార్లు పెట్టి, పైపులు వేసి నీటి కోసం పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతోందన్నారు. పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సింగూరు నుంచి నీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి మంజీరాలోనే ధర్నా చేస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.




