1 April, 2026 | 2:36 AM

లేబర్ కోడ్ల రద్దుకు నేటి బ్లాక్ డేను జయప్రదం చేయాలి: కార్మిక సంఘాల పిలుపు

01-04-2026 12:00 AM

ఇల్లందు టౌన్, మార్చి 31 (విజయక్రాంతి):  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిర్వహించనున్న బ్లాక్ డేను కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

మంగళవారం ఇల్లందులో ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో కొక్కు సారంగపాణి, ఎస్.ఏ. నబి, మల్లెల వెంకటేశ్వర్లు, బానోత్ రాంసింగ్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఈ కోడ్లు అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత దెబ్బతినడంతో పాటు కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు పూర్తిగా రద్దు చేసే వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. నేడు బ్లాక్ డేను విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రాసుద్దీన్, కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.