15 July, 2026 | 1:04 AM

నీట్ లీకేజీలో కోట్లు చేతులు మారాయి

05-07-2024 03:26 PM

జగిత్యాల,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ... నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ విచారణ సుప్రీం కోర్ట్ పరిధి నుండి సిబిఐ చేతిలోకి వెళ్ళిందని అన్నారు. అయితే సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థగా మారిందని కేంద్రానికి సిబిఐ అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆదుకుంటుందని ఆయన ఆరోపించారు.

నీట్ పేపర్ లీకేజీపై సుప్రీం కోర్ట్  న్యాయమూర్తితో  విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయిని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నీట్ పరీక్ష నిర్వహణపై రాష్టాలకే అధికారం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకమైన నీట్ పరీక్ష నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండు చేశారు. నీట్‌ పరీక్ష లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రాష్ట్రాల వారిగా పరీక్ష నిర్వహించేందుకు రాష్ట్రాలకు బాధ్యత అప్పగించాలని జీవన్‌రెడ్డి డిమాండు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.