17 August, 2026 | 8:55 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ PAC సమావేశం

17-08-2026 08:20 PM

ఆలేరు, ఆగస్ట్ 17 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్‌లో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ PAC (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తదితర అంశాలపై నాయకులు చర్చించారు.

సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నాయకులు సూచించారు.