రాత్రి బస్సు సర్వీసును పునరుద్ధరించాలి
హత్నూర ఆగస్టు 17: సిరిపురం గ్రామంలో నిలిచిపోయిన నైట్ హాల్ట్ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ సిరిపురం సర్పంచ్ బి. భూపాల్ రెడ్డి టీజీఎస్‌ఆర్టీసీ మెదక్ రీజియన్ ఆర్‌ఎంకు సోమవారం వినతిపత్రం అందజేశారు. గత వారం రోజులుగా నైట్ హాల్ట్ బస్సు సర్వీసు లేకపోవడంతో సిరిపురం పరిసర గ్రామాల నుంచి పటాన్‌చెరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గతంలో పటాన్‌చెరు నుంచి రాత్రి 11:40 గంటలకు సిరిపురం చేరుకుని, తెల్లవారుజామున 4:40 గంటలకు తిరుగు ప్రయాణం చేసే బస్సు సర్వీసు ఉండేదని, దానిని యథావిధిగా పునరుద్ధరించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎం హామీ ఇచ్చినట్లు సర్పంచ్ భూపాల్ రెడ్డి తెలిపారు.






