10 July, 2026 | 1:50 PM

ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష

01-12-2024 03:34 AM

అంతర్గత విభేదాలపై ఖర్గే ఆందోళన

పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవని వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 30: అంతర్గత విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పరస్పరం వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మానకోకపోతే ప్రత్యర్థులను ఎలా ఓడించగల మని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశా రు.

పార్టీలో లోపాలను సరిదిద్దడానికి, జవాబుదారీతనం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సమర్థించారు. కాంగ్రెస్‌ను ఒక ప్రతిఘటన సంస్థగా అభివర్ణించిన ఆయన  నేత లు విశ్వాసం ఉంచాలని కోరారు. ఓటములపై పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు హర్యానా, మహా రాష్ట్రల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.  

మీ డౌట్స్ ఏంటో చెప్పండి: ఈసీ

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఎలక్షన్ కమిషన్ తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ నాయకులు రావాలని ఆహ్వానించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి  లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలను చెబుతామని తెలిపింది.

ఈక్రమంలోనే స్పందించిన ఎలక్షన్ కమిషన్ ‘ప్రతి దశలోనూ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలను విన్న తర్వాత రాతపూర్వకంగా సమాధానం ఇస్తాం’ అని తెలిపింది.