calender_icon.png 13 February, 2026 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాలనకు ప్రజా తీర్పే నిదర్శనం!

13-02-2026 03:53:00 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం.

కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలో విజయోత్సవ ర్యాలీలు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించారని, ఈ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ప్రభుత్వంపై ప్రజల సంతృప్తిని ప్రతిబింబిస్తోందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 19 స్థానాలకు గాను 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించడం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది మరో ఆరు స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కల్వకుర్తి మున్సిపాలిలో మొత్తం 22 వార్డుల గాను కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధించగా బిజెపి 5 స్థానాలు,  బిఆర్ఎస్ మూడు స్థానాలు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. 

ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు తిరస్కరించారని, తమ తీర్పుతో వారికి గుణపాఠం చెప్పారని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు వేరువేరుగా వ్యాఖ్యానించారు. ఈ విజయోత్సాహం రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు మున్సిపాలిటీలలో చైర్మన్ స్థానానికి సరిపడే మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది.