07-02-2026 01:27:22 AM
అలియాబాద్‌లో ఉద్రిక్తత
-ప్రచార రథం డీజే సౌండ్‌పై వివాదం
బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దం ధ్వంసం
మేడ్చల్/శామీర్‌పేట్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్‌లో కాంగ్రె స్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు శుక్రవారం కొట్లాటకు దిగారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రచార రథం డీజే సౌండ్ వివాదానికి కారణమైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ప్రచారం ముగించుకుని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్‌లో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో అభ్యర్థులతో సమావేశమయ్యారు.
ఈ సమ యంలో అదే ప్రాంతానికి కాంగ్రెస్ ప్రచార రథం వచ్చింది. సమావేశం జరుగుతున్నందున సౌండ్ తగ్గించాలని బీఆర్ ఎస్ కార్యకర్తలు సూచించారు. సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు వైర్లు తీసేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో మల్లారెడ్డి కారు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.
పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడే ఇంట్లో మల్లారెడ్డి ఉన్నారు. విషయం తెలుసుకొని డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన రౌడీలను వెళ్లగొట్టాలని, మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఓటమి భయంతోనే దాడి: మల్లారెడ్డి
కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతోనే కవ్వింపు చర్యలకు పాల్పడి దాడిచేశా రని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నా రు. తాము ఇంట్లో సమావేశం అయినప్పు డు ప్రచారరథం తీసుకువచ్చి పెద్దగా సౌండ్ పెట్టగా, సౌండ్ తగ్గించాలని తమ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారన్నారు. అయినప్పటికీ వినిపించుకోకుండా మరింత సౌండ్ ఎక్కువపెట్టి వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లారని, దీంతో తమ కార్యకర్తలు సౌండ్ తగ్గించారన్నారు. కాంగ్రెస్ గుండాలు వచ్చి తమ కార్యకర్తలపై దాడి చేశారని, తమను కూడా హత్య చేయాలని ప్రయత్నించారని.. గన్ మెన్ లు అడ్డు కున్నారని అన్నారు.
రౌడీలు దాడి చేశారు: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
కాంగ్రెస్ ప్రచార రథం వైర్లు ఎందుకు తీసేసారని అడిగినందుకు మల్లారెడ్డి వెంట వచ్చిన మల్కాజిగిరి రౌడీలు తమ కార్యకర్తలు, మహిళలపై దాడిచేశారని డీసీసీ అధ్య క్షుడు వజ్రేష్ యాదవ్ అన్నారు. నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారరథం తిరగకుండా ఇబ్బందులు పెడుతున్నా రన్నారు. మల్కాజిగిరి నుంచి వచ్చిన వారందరిపై పోలీస్ కేసులు ఉన్నాయని, వారంద రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓటమికి భయపడి రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నా, ధ ర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. తమ కు ఎవరు దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.