15-11-2025 12:59:55 AM
-ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్
-నైతిక విజయం నాదే.. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీయిజంతో గెలిచారని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఆడబిడ్డపై కుట్రలు చేసి, ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని కూడా గెలుపు అంటారని నేను అనుకోవడం లేదన్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘నాలుగైదు పార్టీలతో కలిసి అధికార పార్టీ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడింది.. రౌడీయిజం చేసి గెలిచింది.. నా భర్త గోపీనాథ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ల ఆటలు సాగలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్‌ది గెలుపు కాదు, నైతికంగా నాదే విజయం. కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్లే మేము ఓడిపోయామని నేను అనుకోవడం లేదు, అని ఆమె స్పష్టం చేశారు.
కౌంటింగ్ కేంద్రంలో తమ పార్టీ నేతలను ర్యాగింగ్ చేశారని ఆరోపిస్తూ, మేము కట్టుకున్న చీరలపై కూడా చిల్లరగా మాట్లాడటం చాలా బాధ అనిపించింది. జూబ్లీహిల్స్‌లో అప్పుడే రౌడీయిజం మొదలైంది, అని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.