బాధిత కుటుంబానికి పరామర్శ
మొయినాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యెన్కెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్గని సత్యనారాయణ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఉదయం పొలం వద్దకు వెళ్లి వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చిన సత్యనారాయణకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీమ్భరత్ శుక్రవారం యెన్కెపల్లిలోని సత్యనారాయణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం తెలిపి, సత్యనారాయణ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మాజీ అధ్యక్షుడు మాణయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కావలి రమేష్ ముదిరాజ్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు తలారి బిక్షపతి ముదిరాజ్, అల్లం వెంకటేష్ గౌడ్, అశోక్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి మల్లేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






