ఆసుపత్రిలో వానర మూకల అడ్డా
గట్లమల్యాల పీహెచ్‌సీలో రోగుల అవస్థలు
నంగునూరు, ఆగస్టు 28 (విజయక్రాంతి):ప్రాణాలు నిలబెట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఆసుపత్రి,రోగుల పాలిట భయకంపితంగా మారింది.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కోతుల దాడులు, అపరిశుభ్రతతో రోగులకు నరకంగా మారింది. ఆస్పత్రి కిటికీల అద్దాలు పగిలిపోయి చాలాకాలం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో,కోతులు గుంపులుగా లోపలికి చొరబడి మందులు,
ముఖ్యమైన రికార్డులను నాశనం చేస్తున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే గర్భిణులు,బాలింతలు, వృద్ధులు ఏ క్షణంలో వానరాలు దాడి చేస్తాయోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. మరోవైపు ఆస్పత్రిలో కనీస పారిశుధ్యం లోపించడంతో కొత్త రోగాలు అంటుకుంటాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కిటికీలకు మరమ్మతులు చేయించి కోతుల బెడద తప్పించాలని, ఆస్పత్రిలో పారిశుధ్య చర్యలు చేపట్టి రోగులకు భరోసా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






