5 July, 2026 | 2:40 AM

మిగిలిన సన్న ధాన్యం!

05-07-2026 01:11 AM
  1. అమ్మకానికి కసరత్తు
  2. అధికారులతో మంత్రి ఉత్తమ్ మార్గాల అన్వేషణ

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రైతుల నుంచి వచ్చిన ధాన్యం.. మిల్లింగ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ప్రభుత్వం దానిని విక్రయించేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నది. 2025 సీజన్ ఖరీఫ్‌లో రాష్ట్రం మొత్తంపై 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. ఇందులో సన్నరకం, దొడ్డురకం రెండూ ఉన్నాయి. ఈ సీజన్‌లో కేంద్రం ప్రభుత్వం అనుమతించిన మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు, అలాగే రాష్ట్ర అవసరాల మేరకు సివిల్ సప్లు విభాగానికి మొత్తం 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు.

ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి అటు ఎఫ్‌సీఐకి, ఇటు సివిల్ సప్లుకి మిల్లర్లు అప్పగిస్తున్నారు. బియ్యం అప్పగింత చివరి దశకు చేరుకుంది. అయితే మొత్తం సేకరించిన 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లుకి బియ్యం రూపంలో అందించారు. కానీ ప్రభుత్వం వద్ద మిగిలిపోయిన 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

ఈ దిశగా పౌరసరఫరాల మంత్రి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపు తున్నారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని అమ్మేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఒక్కో క్వింటాలుకు రూ. 3,405 చొప్పున కొనుగోలుకు టెండర్ పిలిచింది. అంటే సన్నరకం ధాన్యం కావడంతో ఒకింత లాభం వస్తుందనే నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఈ ధరకు ప్రైవేటు వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే.. కొంతలో కొంతైనా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చనేది ఆలోచన. అయితే టెండర్లకు ఆఖరు తేదీ ముగిసేనాటికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా క్వింటాలుకు రూ. 2,737 ను మించి టెండర్లు దాఖలు కాలేదు.

దీనితో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు టెండర్లు రాకపోవడంతో.. ఆ టెండర్లు రద్దుచేస్తూ సివిల్ సప్లు శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు దాఖలుచేసిన టెండరు ధరకే ధాన్యాన్ని అమ్మితే.. నష్టం వస్తుందనే ఉద్దేశంతో టెండరునే రద్దు చేసింది. దీనితో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. దాని విలువ రూ. 6,180 కోట్లు రాబట్టేందుకు మార్గాలు అన్వేషిస్తున్నది. ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఎలా తగ్గించుకుంటుందో చూడాలి.