రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కనుమరుగు
రష్యా మాదిరిగా దేశంలో నియంత పాలన
అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తామంటున్న మూర్ఖులకు ఓటేద్దామా?
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి
కరీనంగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్ సిటీ, మే 6: దేశంలోని ప్రజలను మభ్యపెట్టి, 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు విమర్శించారు. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సీపీఐ గ్రామ, మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి రాజేందర్‌రావు హాజరయ్యారు. ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంచరించుకున్నాయని తెలిపారు.
నియంత పాలనతో ముందుకు సాగుతున్ను బీజేపీ, రామరాజ్యం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు మధ్య ఉద్యమం జరుగబోతుందని చెప్పారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తామని ఒకరు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మరొకరు, రిజర్వేషన్లు రూపుమాపుతామని ఇంకొకరు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ పని అయిపోయిందని, మిగతా ప్రాంతాల్లోనూ బీజేపీని బొంద పెట్టేందుకు ఇండియా కూటమిలోని కమ్యూనిస్టుల కృషి మరువలేనిదని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేసిన బీజేపీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు వదిలిందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చురుగ్గా పనిచేసే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. 89 మంతి దత్తపుత్రులను ఏర్పాటు చేసుకొని ప్రజాధనాన్ని లూటీ చేసి స్విస్ బ్యాంకులకు తరలించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.




