ఆడపడుచులందరికీ అండగా ఉంటాం
మహిళా కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొంగులేటి
ఖమ్మం, మే 6 (విజయక్రాంతి): ఆడపడుచులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో సోమవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ అందజేస్తున్నామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు స్వర్ణకుమారి, నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా పాల్గొన్నారు.




