9 April, 2026 | 7:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

09-04-2026 05:59 PM

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి 

నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ 

అచ్చంపేట ఏప్రిల్ 09: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వ్యవసాయ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు.   నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు మర్రికంటి భవానీ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భూమి సునీల్ కుమార్ హాజరయ్యా  రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కుల గుర్తింపు, పత్రాల సమస్యలు, భూ వివాదాలు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని  ఏసీ గదుల్లో కూర్చుని సమస్యను పరిష్కరించలేమని కమిషన్ భావించిందని అందుకే నేరుగా రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతోనే రైతు కమిషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

రైతులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఈ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామని ప్రత్యేకంగా గిరిజన రైతుల భూ హక్కులను రక్షించడం, ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం రైతు కమిషన్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, రైతుల సంక్షేమం కోసం కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని, భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, సిఫారసులు ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల నేడు రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రైతులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత సన్న చిన్న కారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చట్టాలను సవరించి అటవీ శాఖ భూములను పరిరక్షించుకుంటూ నే రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర కమిషన్ చైర్మన్ వెల్లడించారు.

నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ గుర్తించిందని రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ...., ఏజెన్సీ ప్రాంత భూ సమస్యల పరిష్కారానికి రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన రైతు సదస్సులో ఏజెన్సీ ప్రాంత రైతులు రాష్ట్ర రైతు కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన భూ సమస్యల పరిష్కారానికి జిల్లా  యంత్రాంగం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా సాంకేతిక కారణాల వల్ల రైతులకు మార్టిగేజ్, ఎల్టీ లోన్లు అందడం లేదని రైతులు పేర్కొనగా, ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమంతో  (స్పెషల్ డ్రైవ్ ) నిర్వహించి సక్సెషన్ ప్రక్రియలను పూర్తి చేసి, నేరుగా బ్యాంకులతో సమన్వయం చేసి రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఉన్న 200 ఎకరాల భూమిపై రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బక్కలింగాయపల్లి గ్రామ పరిధిలో భూమి సర్వే పూర్తయ్యిందని, ఆ భూమి రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని తెలిపారు. సంబంధిత రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సమస్య మొదటిసారి తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. 

అలాగే బుధవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇదివరకే గుర్తించిన ప్రదేశాల్లో టూరిజం ప్రాంతాలను అభివృద్ధిపరిచి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజల ఆర్థిక అభివృద్ధికి జిల్లా సంఘం కృషి చేస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కు వివరించారు.ఈ సందర్భంగా రైతు కమిషన్ అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలపై సమగ్ర అవగాహన పొందేందుకు రైతులతో నేరుగా సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, పత్రాల సమస్యలు, సాగుభూముల హక్కులపై తమ అభిప్రాయాలను, సమస్యలను కమిషన్ దృష్టికి వివరంగా తెలియజేశారు.

అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్, పదర మండలాల్లో ఉన్న నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గతంలో ఈ ప్రాంత రైతులకు మార్టిగేజ్ మరియు ఎల్.టి. లోన్లు లభించేవని, కానీ ప్రస్తుతం భూ సమస్యల కారణంగా బ్యాంకుల నుండి ఎలాంటి రుణాలు అందడం లేదని, ఈ ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించాలని సంకల్పంతోనే నేడు రైతుల వద్దకే రైతు కమిషన్ చైర్మన్ తన సభ్యులతో కలిసి రావడం సంతోషించదగ్గ విషయమని ఆయన కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

ఇక్కడ ఉన్న రైతుల సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి శాశ్వత పరిష్కారం తీసుకునేలా కమిషన్ కృషి చేయాలని, గత ప్రభుత్వం కొంతమంది గిరిజనులకు భూములేనప్పటికీ పట్టాలు ఇచ్చారని, కొంతమంది రైతులు 1932 నుండి భూమిని సాగు చేస్తున్నప్పటికీ వారిపై పట్టాలు లేవని అలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా అధికారులు కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ప్రాంత రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు “భూ దార్” వంటి కార్యక్రమాలను తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలను పరిష్కరించే దిశగా, అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తూ రైతులకు న్యాయం జరిగేలా ఆయిల్ పామ్ సాగుకు అవకాశం కల్పించాలని, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని తెలిపారు. నల్లమల్లలో 24 టూరిజం ప్రాంతాలను గుర్తించినట్లు, నల్లమల్ల ప్రాంత ప్రజలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ అమరేందర్, అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, అమ్రాబాద్ సర్పంచ్ బిగుర్ల కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.