సమన్వయ లోపం.. రైతులకు శాపం
కామారెడ్డిలో నిరుపయోగంగా మారిన రైతు బజార్
మున్సిపల్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయ లోపం
ఎండలోనే కూరగాయలు విక్రయిస్తున్న రైతులు
అర్ధాంతరంగా నిలిచిన సమీకృత మార్కెట్ భవనం పనులు
ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని రైతుల విన్నపం
కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులే తమ పంటల ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తాం అని తరచుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతుంటారు. ఇటు ప్రజలకు, అటు రైతులకు ఉపయోగం చేకూరేలా రైతు బజార్లు ఏర్పాటు చేసి నాణ్యమైన తాజా కూరగాయలు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం అని హామీలు ఇస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పట్టణాల్లో రైతుబజార్లకు మంచి ఆదరణ ఉంటుంది. తాజా కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో వినియోగదారులు అక్కడ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతారు. దీంతో రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు పూర్తి చేశారు. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో అది నిరుపయోగంగా మారింది.
2018లో నిర్మాణం..
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల నుంచి ఎంతోమంది రైతులు తాము పండించిన కూరగాయలను, ఆకుకూరలను విక్రయించేందుకు వచ్చేవారు. అయితే అమ్మకాలకు వారు ఎన్నో తంటాలు పడాల్సి వచ్చేది. రోడ్ల పక్కన కూర్చొని కూరగాయలు విక్రయించేవారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులకు రైతులు ఎన్నోసార్లు తమ బాధను విన్నవించారు. దీంతో 2018లో అప్పటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.50 లక్షలతో గాంధీ గంజ్‌లో వంద మంది రైతులకు సరిపడే విధంగా రైతు బజార్ షెడ్డులు నిర్మించారు. తర్వాత కొద్దిరోజులు రైతులు వాటిలో విక్రయాలు జరిపారు. అయితే మున్సిపల్ శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారుల సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. మున్సిపల్ శాఖ నిధులతో చేపట్టిన కూరగాయల షెడ్డు వ్యవసాయ మార్కెట్ శాఖకు సంబంధించిన స్థలంలో ఉండటంతో ఆ శాఖ అధికారులు కూరగాయలు విక్రయించకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రైతులు మళ్లీ రోడ్లపైనే ఎండలో కూర్చొని కూరగాయలను విక్రయిస్తున్నారు. అరకోటితో నిర్మించిన రైతు బజార్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే తమ బాధను అర్థం చేసుకొని రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
పూర్తికాని సమీకృత మార్కెట్ భవన నిర్మాణం..
ఇదిలా ఉండగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో సమీకృత మార్కెటింగ్ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. రూ.కోటి విలువైన పనులు పూర్తి అయినా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వడం లేదనే సాకుతో మధ్యలోనే నిర్మాణ పనులను వదిలిపెట్టారు. ప్రభుత్వం మారడంతో సమీకృత మార్కెటింగ్ భవన నిర్మాణం పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
అవస్థలు పడుతున్నాం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిత్యం రోడ్డుపైనే ఎండలో కూరగాయలను విక్రయిస్తున్నాం. ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ అవస్థలు పడుతున్నాం. ప్రతిరోజు మున్సిపల్ అధికారులు తైబజార్‌ను వసూలు చేస్తున్నారని కానీ కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు. అధికారులు మా బాధను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గాంధీ గంజ్‌లో నిర్మించిన రైతు బజార్ షెడ్డును రైతులకు కేటాయించాలి.
- రాజు, రైతు, చందాపూర్
ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి
కామారెడ్డిలో 20 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాను. ఎన్నో ఇబ్బందుల నడుమ విక్రయాలు జరుపుతున్నాం. కుటుంబ పోషణకు అన్నీ ఓర్చుకుంటున్నాం. మా బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. రైతు బజార్‌లో కూరగాయలు విక్రయించేలా అధికారులు, ఎమ్మెల్యే చొరవ చూపాలి
- రాజమణి, మహిళా రైతు, కామారెడ్డి




