3 August, 2026 | 1:41 AM

పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలి

22-06-2024 01:15 AM
  • ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మరో ఉద్యమం తప్పదు

ఈ నెల 25న వికలాంగుల సంఘాలతో సమావేశం

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ముషీరాబాద్, జూన్ 21(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని అమలు చేయడం లేదని, తద్వారా రూ. 6,223 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మహిళల ఫ్రీ బస్ పథకాన్ని డిసెంబర్ నెల నుంచి ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు, వృద్దులు, ఒంటరి మహిళల పెన్షన్ల పెంపును అదే నెల నుంచి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ డబ్బులను ఏడు నెలలుగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వితంతువులు 39,35,345 మంది ఉంటే వారికి నెలకు 2 వేల చొప్పున రూ. 780 కోట్లు మాత్రమే అందజేస్తున్నారని, పెంచిన హామీతో ప్రతినెలా రూ. 1550 కోట్లు అవసరమని చెప్పారు. వికలాంగులు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఉంటే వారికి నెలకు రూ. 4 వేల చొప్పున రూ.204 కోట్లు అవసరమన్నారు. పెంచిన 2 వేలతో కలుపుకుంటే ప్రస్తుతం నెలకు మరో రూ. 102 కోట్లు అదనంగా అవసరమని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మొదటి స్థానంలో ఉంటే, రేవంత్ రెడ్డి ఎగ్గొట్టడంలో మొదటి స్థానంలో ఉన్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల మందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్‌లను డిసెంబర్ నుంచి చెల్లించి వికలాంగులు, వృద్దులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ అండతో వికలాంగుల హక్కుల పోరాట సమితి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. పెన్షన్ల పెంపు పై చర్చించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో అన్ని వికలాంగుల సంఘాలతో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు.

త్వరలో అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిసామన్నారు. వీహెచ్‌పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామనే ని భవానిచౌదరి, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, కోర్ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు, రాంబాబు, నాయకులు గరిగంటి రజిత, కొణిదల నరేష్ పాల్గొన్నారు.