25 August, 2026 | 11:34 PM

అబద్ధపు ప్రచారాలతో పైశాచిక ఆనందం పొందాలని కుట్ర

25-08-2026 10:11 PM

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు,(విజయక్రాంతి): తనపై ఐదు వేల ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించుకున్నారంటూ కొందరు విషప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. ఆ ఆరోపణలను నిరూపిస్తే ఆ భూములను ప్రజలకు పంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజా సేవకే అంకితమై పనిచేశానని, కనీసం మణుగూరులో కూడా తనకు సొంత నివాసం లేదని తెలిపారు.

రాజకీయంగా లబ్ధి పొందేందుకు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో తన గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

తన ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా 50 ఎకరాలు కూడబెట్టుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తన ఆస్తులను నిరుపేదలకు పంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై ఆరోపణలు చేస్తున్న వారు తమ ఆస్తులను పేదలకు పంచేందుకు సిద్ధమా అని రేగా కాంతారావు ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.