26 August, 2026 | 1:24 AM

ఎంఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

25-08-2026 11:13 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ జగపతిరావుకు అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ... పాఠశాలలు పునః ప్రారంభమైన ఈ మూడు మాసాల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, కానీ విద్యార్థుల మెనూ చార్జీలు మాత్రం పెరగలేదని, ఫలితంగా వంట కార్మికులు పాఠశాల మెనూ ప్రకారం వంట నిర్వహణ కష్టతరం అవుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, గుడ్లు వంట బిల్లులు వెంటనే చెల్లించాలని,

పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా విద్యార్థుల మెనూ చార్జీలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు మధ్యాహ్నం భోజన కార్మికులకు పదివేల రూపాయలు వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఎదురు పెట్టుబడి పెట్టి గ్రుడ్లు, కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నప్పటికీ రెండు నెలలు బిల్లులు నేటికీ విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వమే వంట గ్యాస్, గ్రుడ్లు సరఫరా చేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, సత్యవతి, శ్రీదేవి, పార్వతి, జయలక్ష్మి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.