హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర

10-05-2024 03:00:39 AM

కాంగ్రెస్ రాష్ట్రానికి అంధకారం తెచ్చింది

భైంసాలో దాడి బీజేపీ గుండాల పనే

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో/ఆదిలాబాద్(నిర్మల్), మే 9 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందు కు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు విమర్శించారు. ఐదుగురు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లలో గెలిపిస్తే తిరిగి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితులు వస్తాయని, ఆ విధంగా బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టవచ్చన్నారు.

మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ నివేదిత గెలుపు కోరు తూ అల్వాల్, కంటోన్మెంట్ ఇంపిరీయల్ గార్డెన్‌లో యూత్ కనెక్ట్ విత్ కేటీఆర్ అనే పేరుతో బీఆర్‌ఎస్ యువ సమ్మేళనం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూన్ 2తో తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయి ఉమ్మడి రాజధాని గడువు ముగిస్తుందన్నారు. అనంతరం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి హైదరాబాద్‌ను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను పడగొట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం తప్ప ఎన్నికల్లో కొట్లాడి రాష్ట్రాలను గెలుచుకునే చరిత్ర బీజేపీకి లేదన్నారు.  

కేంద్రానిది సవతి తల్లి ప్రేమ..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అంధకారం తీసుకొచ్చిందని విమర్శించారు. 100 రోజు ల్లో హామీలను అమలు చేస్తామని నమ్మించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక.. ఇన్వర్టర్, జనరేటర్, క్యాండిల్స్, టార్చ్‌లైట్, పవర్‌బ్యాంక్, చార్జింగ్ లైట్‌లను తప్పకుండా ఉంచుకోవాల్సిన పరిస్థితులను కల్పించినట్టు ఎద్దేవా చేశారు.

కరీంనగర్ రోడ్డులో జేబీఎస్ నుంచి 11 కిలోమీటర్ల పొడవున స్కై వే, ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా మరో స్కైవే వేద్దామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుకుంటే కేంద్రం డిఫెన్స్ భూములు ఇవ్వడానికి అంగీకరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది కేవలం సవతి తల్లి ప్రేమ మాత్రమే అని అన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చే సంగతి తర్వాత గానీ, కార్నింగ్, కేన్స్ వంటి కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లినట్టు చెప్పారు. కార్యక్రమంలో మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ ఇన్ చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కేటీఆర్‌కు నిరసన సెగ..

శ్రీరాముడిపై గతంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయనకు నిరసన సెగ తగిలింది. పార్టీ ఆధ్వర్యంలో భైంసాలో చేపట్టిన రోడ్ షోను హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు చేబూని నిరసన తెలిపారు. కొందరు రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు శాంతిభద్రతలను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో కళ్లారా చూస్తున్నామని మండిపడ్డారు. అనంతరం రోడ్ షోకు బ్రేక్ పడింది. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళనకారులు నిరసనను విరమించుకున్నారు. అనంతరం కేటీఆర్ రోడ్ షో సాఫీగా సాగింది. బైంసాలో తనపై బీజేపీ గుండాలు దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు.  విద్వేషాలు పెంచే వారిపైన  తన పోరాటం ఆగదని స్పష్టంచేశారు.

రాముడిని అడ్డం పెట్టుకొని బీజేపీ మత రాజకీయాలు 

రాముడిని అడ్డం పెట్టుకొని బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. విదేశాల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పు జమ చేస్తానని అధికారంలోకి వచ్చిన బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉందని, కానీ ప్రజలు చేసిన మేలేమీ లేదని ధ్వజమెత్తారు. ఐదు నెలల క్రితం కాంగ్రెస్‌ను నమ్మి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మోసపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిత్యం కరెంటు కోతలేనన్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని నిప్పులు చెరిగారు. రుణమాఫీ, ఆడ పిల్లల పెండ్లికి తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్..  ఇలా హామీలన్నింటినీ పక్కన పెట్టిందన్నారు. రోడ్ షోలో నిర్మల్ జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకురాలు రమాదేవి పాల్గొన్నారు.