డీకే అరుణమ్మ ఓడిపోతే.. పాలమూరుకు జిల్లాకు వచ్చే నష్టమేం లేదు: సిఎం రేవంత్ రెడ్డి
నేను అభివృద్ధికి కృషి చేస్తుంటే.. కత్తులు పట్టుకున్నారు
బిజెపికి ఓటు వేస్తే.. తెలంగాణకు పెట్టుబడులు రావు
మక్తల్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మక్తల్ లో జనజాతర సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మద్దతుగా సిఎం రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్టాడుతూ... ప్రత్యేక రాష్ట్రంలో కూడా పాలమూరు జిల్లాలకు అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించలేదని ఆరోపించారు. 70 ఏళ్లు గడిచినా.. ఈ పాలమూరు జిల్లాకు సాగునీటి కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనకళ్లముందు పారే కృష్ణమ్మ మన పొలాలను తడపలేదని పేర్కొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్న సిఎం పాలమూరు జిల్లా కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇంటివాళ్లే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ సుల్తానుల కోసం సొంత జిల్లాకే అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బంగ్లాలో కూర్చొని కుట్రలు చేస్తున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే.. పడగొట్టాలని డీకే అరుణ చూస్తున్నారని తెలిపారు.
పాలమూరు జిల్లా బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తుంటే.. కత్తులు పట్టుకున్నారన్నారు. ఇప్పుడు అవకాశం చేజారితే.. ఈ జిల్లా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని తెలిపారు. ఇప్పుడు డీకే అరుణమ్మ ఓడిపోతే.. పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదని సిఎం సూచించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లుగా పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? అని ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేస్తే.. రిజర్వేషన్లు రద్దుకు తీర్పు ఇచ్చినట్లే.. బిజెపికి ఓటువేస్తే.. మత విద్వేషాలను ప్రోత్సహించినట్లేనని సిఎం హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్ కు సంస్థలు, పెట్టుబడులు పోవటం ఎప్పుడైనా చూశామా? నిత్యం మతకలహాల వల్ల యూపీకి ఎలాంటి పెట్టుబడులు రావటం లేదన్నారు. బిజెపి ప్రభావం లేదని గుర్ గ్రామ్ కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో బిజెపికి ఓటు వేస్తే... తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ఏ రాష్ట్రంలోనైనా మత కలహాలు ఉంటే పరిశ్రమలు రావు.. ఉపాధి అవకాశాలు పెరగవని తెలిపారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బిజెపికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.






