5 August, 2026 | 4:21 PM

ఆప్‌ను ఊడ్చేసే కుట్ర

20-05-2024 12:44 AM

పార్టీని నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది

మా ఎదుగుదలను ప్రధాని తట్టుకోలేకపోతున్నారు

అందుకే ఆపరేషన్ ఝాడూ ప్రారంభించారు

మా నేతలను అరెస్టు చేస్తారు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు

న్యూఢిల్లీ, మే 19: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై ఆమ్‌ఆద్మీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆప్‌ను తుడిచిపెట్టేందుకు బీజేపీ ఆపరేషన్ ఝాడూ పేరుతో కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆప్ జాతీయ స్థాయిలో ఎదిగితే తమకు సవాలుగా మారుతుందని, అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మింగుడు పడటం లేదని తెలిపారు.

తన సెక్రటరీ బిభవ్‌కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పార్టీ కార్యకర్తలతో వెళ్లిన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ను నాశనం చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారు. అం దుకే రోజూ మా పార్టీపై విమర్శలు చేస్తున్నారు. నాకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఝాడూ అనే కుట్రను ప్రారంభించింది. త్వరలో ఆప్‌లోని కీలక నేతలను అరెస్టు చేస్తారు. ఎన్నికలు కాగానే ఆప్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. ఇప్పటికే ఈడీ తరఫు న్యాయవాది కోర్టులో ఈ ప్రకటన చేశారు. ఆప్ కార్యాలయాలను సైతం మూసివేస్తారు అని ఆరోపించారు. 

మమ్మల్ని ఎవరూ పడగొట్టలేరు..

ఆప్ నేతలను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే బిభవ్‌ను అరెస్టు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బీజేపీ కార్యాలయానికి వెళ్తామన్నారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఆప్ కార్యాలయం ఎదుటనే కేజ్రీవాల్ బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లా డుతూ.. తమను అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఓడిపోయినట్లేనని ఆన్నారు. ఒకవేళ తాము అరెస్టయితే అది అది తమ పార్టీని బలహీన పరుస్తుందో? లేదా మరింత పటిష్ఠ  పరుస్తుందో చూడాలన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లో తాము ఉచిత విద్యుత్, నీరు అందించామని, నిజాయితీతో డబ్బును ఆదా చేశామని తెలిపారు. పాఠశాలలు, దవాఖానాలను ఆధునికీకరించామని తెలిపారు. ప్రతి పనిలో స్ఫూర్తిదాయకంగా పని చేశామని, తమను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. ఇది దేశమంతా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. 

నిందితుడిని రక్షించేందుకు..

కేజ్రీవాల్ నిరసనపై ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ కూడా స్పందించారు. ఒకప్పుడు ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురైన నిర్భయకు న్యాయం జరగాలని వీధుల్లోకి వచ్చినవారు ఇప్పుడు ఓ నిందితుడిని రక్షించేందుకు అలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాలపై పోరాటం చేశామని, ఇప్పుడు నిందితుల రక్షణ కోసం జరుగుతోందని విమర్శించారు. సీసీటీవీ ఫుటేజీలను తొలగించి, ఫోన్లను ఫార్మాట్ చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.