5 August, 2026 | 3:17 PM

ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

20-05-2024 12:46 AM

8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్

ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు

ఢిల్లీ, మే 19 : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తవ్వగా.. నేడు 5వ విడత పోలిం గ్ జరగనుంది. ఈ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదో విడతలో 8 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఒడిశా శాసనసభలోని 35 నియోజకవర్గాలకు ఏక కాలంలో పోలింగ్ జరగనుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్, లడఖ్‌లలో ఒక్కో స్థానంలో 94,732 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది.

ఐదో విడతలో మొత్తం 8.95 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు, 5409 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియలో 9.47 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు. కాగా, ఐదో దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాయ్‌బరేలీ, అమేథీలో ఎన్నికలు ఐదో విడతలోనే జరగనున్నాయి. రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ చేస్తున్నారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు.