కూల్చిన చోటే నిర్మాణం?
- నాలా పక్కన అక్రమ నిర్మాణాలు
- చోద్యం చూస్తున్న అధికారులు
కూకట్‌పల్లి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ పరిది అంబేద్కర్ నగర్ ముళ్ళ కత్త చెరువు నాలను (Mullakathacheruvu Nala) ఆనుకొని కొందరు కబ్జాదారులు యాదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో అదే ప్రాంతంలో నాలాను కబ్జా చేసి కొందరు కబ్జాదారులు రూములను నిర్మిస్తే అధికారులు కూల్చివేశారు. అధికార యంత్రాంగము ఎస్‌ఐఆర్ ప్రక్రియలో (SIR Process) పనిచేస్తుండటం తో అదును చూసుకొని అక్రమ నిర్మాణదారులు యదేచ్చగా నిర్మాణాలను చేపట్టారు.
గత కొంతకాలంగా నగర పరిధిలోని నాళాలు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసినప్పటికీ కబ్జాదారులు కబ్జాలు చేయడంలో వెనుకడుగు వేయడం లేదు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గదిని నిర్మించి స్థానిక అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఆ స్థలం తమ సొంతమవుతుందనే ఆశతో కబ్జాలు చేయడానికి కబ్జాదారులు వెనకాడడం లేదు.
ఇదే స్థలంలో గతంలో రెండు సార్లు కూల్చివేసినప్పటికీ అధికారుల సహకారం నాయకుల అండతో స్థలాన్ని ఆక్రమించుకోవచ్చని దృఢ నిశ్చయంతో గది నిర్మానానికి ఖర్చు పెట్టడానికి వెనకాడడం కబ్జాదారులు వెనకాడడం లేదు. హైటెక్ సిటీకి కూతవేటు దూరం లో ఈ స్థలం ఉండడం, సమీపంలో కూకట్పల్లి కోర్టు ఉండడంతో ఇక్కడ భూమి విలువ అత్యంత ఖరీదైనదిగా మారింది.
కెపిహెచ్బి కాలనీ పరిసరాల్లో గజం విలువ లక్షల్లో పలుకుతుండడంతో కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడానికి బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్న కబ్జాదారులు అక్కడ పాగా వేస్తున్నారు. నాలను ఆనుకొని ఉన్న ఏ చిన్న స్థలాన్ని అయినా వదలకుండా కబ్జా దారులు కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారులకు అందాల్సినది అందితే అధికారులు ఆ పక్కకే రారని వాదన ప్రజల్లో బలంగా ఉండడం ఈ సంఘటన రుజువు చేస్తుంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..
స్థానికులు నాళాలు కబ్జాకు గురవుతున్నట్లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. వేళల్లో ఖర్చుపెట్టి లక్షల్లో సంపాదించడానికి రాజకీయ అండ, అధికారుల అవినీతిని తమకు అనుకూలంగా కబ్జాదారులు మలుచుకుంటున్నారు. కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాన్ని అమాయక ప్రజలకు అమ్ముకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఆ స్థలం పై పూర్తి వివరాలు తెలియని అమాయక ప్రజలు తక్కువధరకు వస్తుందనే ఆశతో కొనడానికి ఆసక్తి చూపుతున్నాను.స్థలం కొన్న కొన్ని నెలలకు ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేతలు చేపట్టడంతో రోడ్డున పడి బోరున విలపిస్తున్నారు. నగరంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు ఎన్నో పునరావృతమయ్యాయి. భూ ఆక్రమణలను ఆదిలోనే అధికారులు అడ్డుకున్నట్లయితే అమాయక ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు.
నాలాలను కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని అమాయక ప్రజలను కబ్జాదారుల నుండి కాపాడాలని, కబ్జాదారుల నుండి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుచున్నారు.