72 గంటల్లో 70 ఫీట్ల బ్రిడ్జి నిర్మాణం
28-06-2024 03:52 AM
- భారత సైన్యం సాహసోపేత చర్య
గాంగ్‌టక్, జూన్ 27: దేశ సరిహద్దులనే కాదు.. కష్టాలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడేందుకు కూడా ముందుంటామని మన వీర సైనికులు ఎన్నోసార్లు నిరూపించారు. తాజాగా భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న సిక్కింలో మరో సాహకార్యం రికార్డు సమయంలో పూర్తిచేసి ఔరా అనిపించారు. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ సమీపంలోని డిక్చు రోడ్డు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంటనే రంగంలోకి దిగిన త్రిశక్తి కార్ప్స్‌కు చెందిన సైనిక ఇంజినీర్లు 70 ఫీట్ల పొడవున బెయిలీ బ్రిడ్జిని కేవలం 72 గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం 25వ తేదీన ముగిసింది. ఈ బ్రిడ్జి నిర్మాణ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.






