నేడు ట్రంప్, బైడన్ డిబేట్
- ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు సిద్ధమైన నేతలు
వాషింగ్టన్, జూన్ 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే ప్రెసిడెన్షియల్ డిబేట్ శుక్రవారం జరుగనున్నది. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌తో, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివిధ అంశాలపై వాదనలు వినిపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎన్‌ఎన్ నిర్వహిస్తున్నది. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆ సంస్థ కొన్ని నిబంధనలు పెట్టింది. రెండు పార్టీల అభ్యర్థులతోపాటు, కార్యకర్తలు కూడా ఈ నియమాలను పాటించాల్సిందేనని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈసారి ఇద్దరు అభ్యర్థుల వద్ద అత్యాధునిక మైక్రోఫోన్లు అమర్చుతారు.
మైక్రోఫోన్ ఆకుపచ్చ రంగులో వెలిగితే ఆ అభ్యర్థి మాట్లాడుతున్నది అందరికీ వినిపిస్తున్నదని, తన వాదన కొనసాగించవచ్చని అర్థం. మైక్రోఫోన్ ఆగిపోతే అభ్యర్థి మాట్లాడుతున్నది ఎవరికీ వినిపించటం లేదని అర్థం. చర్చ సందర్భంగా ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొ కరు అడ్డుపడినా, అనవసరంగా మాట్లాడేందుకు ప్రయత్నించినా అతడి మైక్రోఫోన్ ఆగి పోతుంది. ఈ నిబంధనను రెండు పార్టీలు అంగీకరించినట్టు ఈ చర్చ నిర్వహించనున్న సీఎన్‌ఎన్ యాంకర్లు ఫిల్ మాటింగ్లీ, విక్టర్ బ్లాక్‌వెల్ తెలిపారు. ఈ చర్చ దాదాపు 90 నిమిషాలు సాగనున్నది.






