23 March, 2026 | 11:46 PM

ప్రభుత్వ పాఠశాలలలో మూత్రశాలలు నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలి

23-03-2026 10:01 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన మూత్రశాలల నిర్మాణాలు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎపిఓలు, సాంకేతిక సహాయకులు, సెర్ప్ ఎపిఎంలతో ఉపాధి హామీ పథకం, స్త్రీ నిధి రుణాలు, బ్యాంకు రుణాల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని 1084 ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూత్రశాలల నిర్మాణ పనులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని, ఆ దిశగా ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మస్టర్ జనరేట్ చేసి బిల్లులు రూపొందించాలని, ఇంకా పనులు ప్రారంభం కాని చోట వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల సమాఖ్య భవనాలు, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలపై అధికారులు పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు చేపట్టే విధంగా గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు శాతం పెంపొందించేలా అధికారులు కృషి చేయాలని, పని ప్రదేశాలలో త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యాలు ఉండేలా చూడాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల అభివృద్ధి దిశగా స్త్రీ నిధి రుణాలు అందజేయాలని, మంజూరు చేసిన రుణాల రికవరీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. తీసుకున్న రుణాలు చెల్లించి తిరిగి అధిక  రుణం పొందేలా స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.