14 July, 2026 | 1:47 AM

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు

13-07-2026 09:37 PM

దమ్మపేట,(విజయక్రాంతి): ఏజెన్సీ ఏరియాలో అక్రమంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో భూబదిలీ చేసిన విషయంపై 'విజయక్రాంతి' దినపత్రికలో వచ్చిన “అక్రమార్కులకు వరంగా భూభారతి” అనే శీర్షికతో వెలుగులోనికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ అంకిత్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, విచారణ అధికారిగా కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మధును నియమించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సోమవారం దమ్మపేట తాహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి బాధిత లబ్దిదారుడు మళ్ళా సత్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణకు వచ్చిన సమయంలో తాహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం తహశీల్దార్ నమక్షంలోనే రికార్డుల పరిశీలన, పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. మంగళవారం జరుగనున్న విచారణలో లోతుగా దర్యాప్తు చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందచేయనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి మధు తెలిపారు.