16 June, 2026 | 2:36 AM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ఆపేసిన కాంట్రాక్టర్

16-06-2026 01:09 AM

ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితురాలు ఫిర్యాదు

న్యాయం చేయాలన్న పద్మాదేవేందర్ రెడ్డి

పాపన్నపేట, జూన్15: పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన ఆర్.సంధ్యకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామ పెద్దల సూచన మేరకు ఇంటి నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్కు అప్పగించినట్లు బాధితురాలు తెలిపారు. కాంట్రాక్టర్ మొదట బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం నిర్మాణ సామగ్రి సరఫరా నిలిపివేసి పనులను అర్ధాంతరంగా ఆపివేశాడని ఆమె ఆరోపించారు.

నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారని కాంట్రాక్టర్ను ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ శ్రీధర్ సూచన మేరకే పనులు ఆపివేశామని సమాధానం ఇచ్చినట్లు  పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ కక్షతో ఇంటి నిర్మాణాన్ని నిలిపివేశారని ఆరోపించారు. ఈ విషయమై సర్పంచ్ను కలిసి సమస్య వివరించగా.. తనను గెలిపించిన 30 మంది అనుమతి ఇస్తేనే ఇంటి నిర్మాణం కొనసాగిస్తానని చెప్పినట్లు సంధ్య తెలిపారు.

అంతేకాకుండా పదేపదే తన ఇంటికి రావద్దంటూ హెచ్చరించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి, తమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసిన సర్ప్ంప తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్ పనులను పూర్తి చేయించి బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.  

బాధితులకు న్యాయం చేయాలి: పద్మారెడ్డి

ఈ సమస్యపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. బా ధితురాలు సంధ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆమె ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యను వివరించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.