ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, జూన్ 15: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతులను సమగ్రంగా పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంగీతతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎలాంటి జాప్యం చేయరాదని చెప్పారు.
అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ డివిజన్లు మరియు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 62 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. అందులో కలెక్టరేట్లో 31, సంగారెడ్డి డివిజన్కు 15, ఆందోల్ డివిజన్లో 0, నారాయణఖేడ్ డివిజన్లో 10, జహీరాబాద్ డివిజన్లో 6 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






