25 July, 2026 | 12:00 AM

ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి సహకరించండి

28-06-2024 12:15 AM

కేంద్ర ఐటీ, పరిశ్రమల మంత్రికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 27( విజయక్రాంతి): తెలంగాణలో ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి సహకరించాలని కేంద్ర సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్‌రామ్ మాంఝీని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గురువారం అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈల దినోత్సవం సందర్భంగా ఆయన కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో లక్ష మంది మహిళలను ఎంపికచేసి శిక్షణతోపాటు ఉత్పా దక సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రారంభించిన యశస్విని పథకం కింద తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.   తెలంగాణలో ఎంఎస్‌ఎంఈల ద్వారా దాదాపు 3.64లక్షల మంది ప్రత్యేక్షంగా ఉపాధి పొందుతున్నారని మాంఝీకి వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సర్కారు మహిళా వికాసానికి అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐలో ఇంజినీరింగ్, డిప్లోమా పట్టాలను పొందిన వారు లక్షల మంది ఉన్నారని, వారికి ఉపాధిని కల్పించేందుకు నూతన శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. తెలంగాణను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా వీక్షించాలని కేంద్ర మంత్రిని శీధర్ బాబు ఆహ్వానించారు.  శ్రీధర్ బాబుతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ కుమార్ కూడా కేంద్ర మంత్రిని కలిశారు.

కేంద్ర మంత్రి కుమారస్వామిని

ఢిల్లీ పర్యటనలో భాగంగా  కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి కుమారస్వామిని కూడా శ్రీధర్ బాబు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సీపీఎస్‌యూల భూముల సమ స్యల గురించి కుమారస్వామికి శ్రీధర్ బాబు వివరించారు. ఈ విషయంలో రాష్ట్రానికి అండగా నిలవాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశారు.