‘నీట్’పై నిరసనల హోరు
- ఢిల్లీలో ఇండియా కూటమి, ఎన్‌డీఏ పోటాపోటీ ఆందోళనలు
- విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం
- న్యాయ పోరాటానికి దిగితే లాఠీచార్జి చేస్తారా?
- విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి
- ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ డిమాండ్
- నీట్ అంశాన్ని రాజకీయం చేయొద్దు
- కేంద్రం సీరియస్‌గా ఉంది, నిందితులపై కఠినంగా శిక్షిస్తాం
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
- ఇరు వర్గాల నిరసనలతో పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ, జూలై 24 (విజయక్రాంతి) : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిపై శుక్రవారం ఢిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇండియా కూటమి నేతలు విద్యార్థులకు మద్దతుగా నిరసనలు చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేశారు. అధికార ఎన్డీఏ ప్రతిపక్షాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసింది. ప్రతి గా ఎన్‌డీఏ సైతం ఆందోళనకు దిగింది.
పార్లమెంట్ వెలుపల రెండు వర్గాల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మా ట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో కేంద్రం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. విద్యార్థులు న్యాయం కోరుతున్నారని, వారి ని నేరస్థులుగా చూడకూడదన్నారు. పరీక్ష వ్యవస్థలో విశ్వసనీయతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘విద్యా ర్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు.
వారిపై బలప్రయోగం చేయడం సరైంది కాదు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు బాధ్యులపై విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఏ ఎంపీల నిరసన
నీట్ అంశంపై ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ ఎన్‌డీఏ ఎంపీలు కూడా పార్లమెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని,పేపర్ లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.
గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ ఘటనలను కూడా పరిశీలించాలన్నారు.విద్యార్థుల సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ, దీనిని ప్రతిపక్షాలు రాజకీయ ఆయుధంగా మార్చడం సరికాదన్నారు. ఇండియా కూటమి ఎంపీలు ఒకవైపు, ఎన్డీఏ ఎంపీలు మరోవైపు ఆందోళన చేపట్టడం, ఇరువర్గాలు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసు లు గొలుసుగా నిలబడి ఇరు వర్గాలను వేరు చేశారు. కాగా నీట్ అంశంపై న్యాయపరమైన చర్యలు కోరుతూ ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి.






