25 July, 2026 | 12:59 AM

ఆధారం లేని కేసముద్రం!

25-07-2026 12:00 AM

ఆధార్ సేవల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

కేసముద్రం, జులై 24 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఆధార్ సేవలను ఇటీవల పూర్తిగా నిలిపివేశారు. గతంలో తాహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ శాశ్వత నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా తహసిల్దార్ కార్యాలయంలో గదిని కూడా నిర్మించి కొంతకాలం పాటు ఆధార్ సేవలు అందించారు. ఆ తర్వాత అక్కడ సేవలు నిలిపివేసి టెలిఫోన్ ఎక్స్చేంజిలో ప్రత్యేకంగా పో స్టల్ శాఖ ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అక్కడ కూడా కొంతకాలం సేవలు అందించి తర్వాత తొలగించారు. మ ళ్లీ తాజాగా కేసముద్రం పట్టణ కేంద్రంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి కొద్ది రోజుల క్రితం వరకు ఆధార్ సేవలు అందించారు. అయితే ఇటీవల నిర్వాహకుడు ఆధార్ సేవలో కొన్ని తప్పులు నమోదు చేసినట్లు గుర్తించి అతని ‘ఐడీ’ సస్పెండ్ చేస్తూ, పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలను నిలిపివేశారు.

దీనితో కేసముద్రం మండల ప్రజలతోపాటు కేసముద్రం పట్టణ ప్రజలకు ఆధార్ సేవలు నిలిచిపోయాయి. ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలు పొందాల్సిన సేవలైన కొత్త ఆధార్ నమోదుపేరు మార్పు/సవరణ,చిరునామా మార్పు, పుట్టిన తేదీ సవరణ,లింగం మా ర్పు, మొబైల్ నంబర్ జోడింపు లేదా మా ర్పు,ఈ-మెయిల్ ఐడీ జోడింపు లేదా మా ర్పు, బయోమెట్రిక్ అప్డేట్ ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్,5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పూర్తి చేసిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అ ప్డేట్, గుర్తింపు, చిరునామా పత్రా ల అప్డేట్ తదితర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

దీనితో 60 వేల మందికి పైగా జనాభా ఆధార్ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అత్యవసర ఆధార సేవల కోసం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి, లేదంటే 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇనుగుర్తి మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్ ఐ ఆర్ నమోదు కార్యక్రమం, రైతులు పంట రుణాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం, ఫోన్ నెంబర్ యాడ్ చేయడానికి, ఇతర సేవల కోసం స్థానికంగా ఆధార్ కేంద్రం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి కేసముద్రం పట్టణంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు.

అధికారులకు నివేదిస్తా

కేసముద్రం మండల కేంద్రంలో ఆధార్ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి శాశ్వత ఆధార్ కేంద్రం తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం. ఆధార్ కేంద్రం తక్షణం ప్రారంభించే విధంగా ఉన్నతాధికారులకు నివేదిస్తా. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధార్ సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసు కుంటాము. 

వివేక్, తహసిల్దార్, కేసముద్రం