గాజు గ్లాసులో తుపాన్!

02-05-2024 01:25:48 AM

చిక్కుల్లో టీడీపీ 

జనసేన గుర్తు వివాదం 

అమరావతి, మే 1, (విజయక్రాంతి): ఏపీలో జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గాజు గ్లాసు గుర్తు వివాదం తెలుగుదేశం పార్టీకి పెద్ద చిక్కుగా మారుతున్నట్లుగా ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే, ఆ గుర్తు జనసేన పోటీచేసే నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలకు మాత్రమేనని ఏపీ హైకోర్టుకు ఈసీ తేల్చిచెప్పింది. ఇందుకు జనసేన పార్టీ తరఫు న్యాయవాది సంతృప్తి వ్యక్తం చేయడంతో పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్  బి.కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీకి ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు జరిగే ఎన్నికల్లో భారీగా నష్టం చేకూరే ప్రమాదం పొంచి ఉందని వెంటనే గ్రహించింది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు ఒప్పందంలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లకు పోటీ చేస్తోంది. అంటే, 21 అసెంబ్లీ సీట్ల పరిధిలోకి ఉండే లోక్‌సభ స్థానాలకు, రెండు పార్లమెంటు సీట్ల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే  స్వతంత్ర, గుర్తింపు లేని రిజిస్ట్టర్డ్ పార్టీలకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయింపు జరగదని, ఇప్పటికే స్వతంత్ర, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ఎవరికైనా గాజుగ్లాసు గుర్తు కేటాయించి ఉంటే వాటి విషయంలో వెనక్కి తీసుకుంటామని ఈసీ హైకోర్టుకు రాతపూర్వకంగా నివేదించింది. ఈ హామీతో జనసేన సంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా అయ్యింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో  స్వతంత్ర, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే.. దాని వల్ల తీవ్రంగా తమ పార్టీ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టులో బుధవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కృష్ణ మోహన్ గురువారం విచారణ చేయనున్నారు. టీడీపీ దాఖలు చేసిన గాజు గ్లాసు గుర్తు వివాదంపై హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు అభ్యర్తుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని న్యాయ, రాజకీయ నిపుణులు అంటున్నారు.