17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పాఠశాలల్లో వంటకు తంటా!

20-06-2025 12:59 AM

వర్షం వస్తే వంట చేసేది ఎలా?

కిచెన్ షెడ్లు లేక ఇబ్బందులు

మహబూబాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్లు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వంట చేయడానికి మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ కార్మికులు ఈ ఏడు కూడా వంటకు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టల్లలో వంటకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోగా, ఆదర్శ,  ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అధిక శాతం కిచెన్ షెడ్లు లేవు. జిల్లా వ్యాప్తంగా 843 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 42 వేల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా ఈ నెలాఖరు వరకు ఆ సంఖ్య మరికొంత పెరగనుంది.

జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం వండి పెట్టడానికి అవసరమైన 1,400 మందికి పైగా వంట మనుషులను ఏజెన్సీ ద్వారా నియమించారు.జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల నిర్మాణ దశలో వదిలేశారు. మరి కొన్నిచోట్ల కిచెన్ షెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇరుకుగా మారడంతో సామాగ్రి నిల్వ చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. వంట పాఠశాలల ఆవరణలో, చెట్ల కింద నిర్వహిస్తున్నారు.

వర్షాలు అధికంగా పడే రోజుల్లో తరగతి గదులు, లేదంటే పాఠశాల వరండాలో మధ్యాహ్నం భోజనం వండి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.   సాధారణ రోజుల్లో వంటకు పెద్దగా ఇబ్బంది లేకపోగా, వర్షాలు కురిసే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం వంట చేయడం ఏజెన్సీ మహిళలకు కష్టంగా మారుతోంది.

దీనికి తోడు చాలా పాఠశాలల్లో నీటి వసతి లేకపోవడం వల్ల నీరు తెచ్చుకోవడం, వంట చేయడానికి సరైన వసతి లేక వంట ఏజెన్సీ మహిళలు వంటకు తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉపాధి హామీ, మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ  పాఠశాల కార్యక్రమాల్లో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీనితో ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలలో వంట చేయడం పెద్ద తంటగా మారిందంటున్నారు. 

పాఠశాలల్లో పెరగని డైట్ చార్జీలు

ప్రభుత్వం గురుకులాల్లో ఇచ్చిన అభ్యసించే విద్యార్థులకు డైట్ చార్జీలను భారీగా పెంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలులో డైట్ చార్జీలను ఆ మేరకు పెంచకపోవడంతో మధ్యాహ్నం భోజనంలో ఆశించిన ‘నాణ్యత’ లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం అమలులో ధరలను 2022లో పెంచగా, అప్పటికి ఇప్పటికీ నిత్యవసర సరుకుల ధరలు, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే తమకు చెల్లించే బిల్లులు ప్రస్తుత ధరలకు సరిపోకపోవడంతో చాలాచోట్ల ‘మెనూ’ సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజనానికి హాస్టల్లో మాదిరిగా డైట్ మెనూ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది. 

పూర్తికాని డైనింగ్ హాళ్ల నిర్మాణం 

మహబూబాబాద్ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఉన్నత  పాఠశాలల్లో చేపట్టిన డైనింగ్ హాళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి ఇబ్బంది తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దీనితో చాలాచోట్ల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం నేలపై లేదంటే వరండాలో  చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే కాకుండా చాలా చోట్ల పాఠశాలల్లో తాగునీటి వసతి సరిగా లేదు. దీనితో ఇంటి నుండి విద్యార్థులు పాఠశాలకు తాగునీటిని వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

అసంపూర్తిగా ఉన్న కిచెన్ షెడ్లను పూర్తి చేయాలి. కిచెన్ షెడ్లు లేని చోట కొత్తగా నిర్మించాలి. తాగునీటి, దైనందిన అవసరాలకు నీటి వసతి కల్పించాలి. డైనింగ్ హాళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. డైట్ చార్జీలను ఉంచి, మెనూ సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. బిల్లులు, వంట ఏజెన్సీ మహిళలకు నెలవారి పారితోషకం పెండింగ్ లేకుండా ఈనెల కా నెలా చెల్లించాలి. మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాల ప్రకారం వండి పెట్టేలా పటిష్ట కార్యాచరణ, పర్యవేక్షణ అమలు చేయాలి.