బాటసింగారం.. సహకార సమరం
- బీసీల ‘చేతి’కే చైర్మన్ పీఠం దక్కేనా?
- రేసులో బుర్ర చందం గౌడ్,బబ్బురి శ్రీనివాస్ గౌడ్ మధ్య గట్టి పోటీ..
- ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికో?
- అబ్దుల్లాపూర్‌మెట్‌లో పెరిగి రాజకీయ వే‘ఢీ’
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 4(విజయక్రాంతి): బాటసింగారం రైతు సేవా సహకార సంఘం( Batasingaram Farmer Service Cooperative Society) అధ్యక్ష పదవిపై బీసీ వర్గానికి చెందిన ఆశావహ నేతలు ప్రస్తుతం దృష్టి సారించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో నూతన పాలకవర్గం ఏర్పాటుపై స్థానికంగా చర్చ జోరందుకుంది. సహకార సంఘం పరిధిలో బీసీ వర్గానికి చెందిన రైతులు, సభ్యులు గణనీయంగా ఉన్నందున, ఈసారి చైర్మన్ పీఠాన్ని బీసీ నాయకుడికే కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమ రాజకీయ పరిచయాలు, పలుకుబడిని ఉపయోగిస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
తెరపైకి ఆశావహుల పేర్లు....
బాటసింగారం సహకార సంఘం అధ్యక్ష పదవికి బీసీ వర్గం నుంచి బుర్ర చంద్రం గౌడ్, బబ్బురి శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. తమకు అవకాశం లభిస్తే సొసైటీని మరింత బలోపేతం చేసి రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ సేవలు అందేలా చూస్తామని వీరు పేర్కొంటున్నారు.
ఎన్నికలా.. నామినేషనా?....
పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సహకార సంఘానికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తారా? లేక నామినేషన్ పద్ధతిలో తాత్కాలిక పాలకవర్గాన్ని నియమిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకవేళ నామినేషన్ పద్ధతి అయితే రాజకీయ సమీకరణాలు కీలకం కానున్నాయి. దీంతో ఆశావహులు ఇప్పటికే కీలక నేతలను, ప్రజాప్రతినిధులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.
రైతుల ప్రయోజనాలే పరమావధి కావాలి:సభ్యులు
రాజకీయ పోటీ ఎలా ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చే పాలకవర్గం రైతుల సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకుని పనిచేయాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. రుణాలు, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, అప్పటివరకు స్థానికంగా రాజకీయ వేడి కొనసాగనుంది.