నేర నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఎస్పిశరత్ చంద్ర పవార్
నల్లగొండ క్రైం, మే 26: నేర నియంత్రణకే పట్టణంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం పట్టణంలో10 బృంథాలుగా ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిచారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పి వివరించారు.
7 గురు సీఐలు, 18 మంది ఎస్.ఐలు నార్కోటిక్ డాగ్ తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు 360 ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా, 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు పరిశీలిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించామన్నారు. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 10 మంది, బీహార్కు చెందిన 4 మంది, తమిళనాడుకు చెందిన 1 వ్యక్తి, అస్సాంకు చెందిన 1 వ్యక్తి, హర్యానాకు చెందిన 2 మంది ఉన్నారు.
ఇద్దరు రౌడీషీటర్లు, 5 మంది ట్రబుల్ మాంగర్స్ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఆరుగురికి గంజా టెస్ట్ లు నిర్వహించగా వీరిలో ఇద్దరిని గంజా సేవించినట్లు గుర్తించడం జరిగిందని అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు వీటిలో అదిక శబ్దం కలిగిన 2 వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభ ద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాల పై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






