27 May, 2026 | 12:58 AM

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

27-05-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 26 (విజయక్రాంతి) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలనీ, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం చివ్వెంల మండలంలోని బిబిగూడెంలో గల శివదుర్గ రైస్ మిల్, తిరుమలగిరి మండలంలోని ఈటూరు గ్రామంలో గల సోమేశ్వర రైస్ మిల్ ఇండస్ట్రీ, వ్యవసాయ మార్కెట్, పారా రైస్ మిల్, తాటిపాముల పిఎసిఎస్  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆన్ లోడింగ్ చేయాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట డీఎస్‌ఓ మోహన్ బాబు, డిఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, చివ్వెంల తహసిల్దార్ చంద్రశేఖర్, తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్, రైస్ మిల్ యజమానులు ఉన్నారు.