12 July, 2026 | 2:22 AM

కార్పొరేట్ లేఆఫ్‌లు

12-07-2026 12:00 AM

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఏఐ విప్లవం రెండువైపులా పదునున్న కత్తిలాగా ఒకవైపు చిన్నాచితక ఉద్యోగాలు సృష్టిస్తూనే, మరోవైపు కార్పొరేట్ ఉద్యోగులపై కత్తిగట్టింది. ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు ప్రతీకగా భావించిన కార్పొరేట్ సంస్థల్లో నేడు లేఆఫ్‌లు సర్వసాధారణమైపోవడం ఆందోళనకరం. ఒకే ఒక్క సందేశంతో వేలాది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఇది కొత్త సంక్షోభంగా పరిణమించింది.

లేఆఫ్‌లకు ఏఐ విస్తరణ, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు కొరవడటం వంటి అంశాలను కంపెనీలు ముఖ్య కారణాలుగా చెప్తున్నాయి. అయితే, ఈ లేఆఫ్‌ల వెనుక మరెన్నో అంశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. వాటిలో మొదటిది, వ్యయ నియంత్రణ. గత కొన్నేళ్లుగా భారీగా నియామకాలు చేపట్టిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఏఐని సాకుగా చూపుతూ వ్యయభారం తగ్గించుకునే ప్రయత్నిస్తున్నాయి.

అత్యధిక వేతనాలు పొందుతున్న సీనియర్లపై వేటు వేసి, వారి స్థానంలో తక్కువ జీతానికి ఇద్దరు, ముగ్గుర్ని నియమించుకోవడం కార్పొరేట్ సంస్థల్లో ఇప్పుడు ఒక నయా ట్రెండ్‌గా మారిపోయింది. రెండోవది, పెట్టుబడిదారుల ఒత్తిళ్లు. యుద్ధాలు, ఆర్థిక మందగమన భయాల వల్ల కార్పొరేట్ సంస్థల షేర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను సంతృప్తిపరిచేందుకు కంపెనీలు వ్యయ తగ్గింపు చర్యలకు దిగుతున్నాయి.

ఈ క్రమంలో లేఆఫ్‌లు వెంటనే ఫలితమిచ్చే మార్గంగా కంపెనీలు భావిస్తున్నాయి. అదే సమయంలో వర్క్ ఫ్రమ్ హోం లాంటి సౌకర్యాల వల్ల తక్కువ వ్యయంతో పనిచేసే ప్రతిభావంతులు అందుబాటులో ఉంటున్నారు. కాగా, లేఆఫ్‌లు భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశీయ లేఆఫ్‌లకు తోడు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది స్వదేశానికి తిరిగొస్తున్నారు. దీనివల్ల రివర్స్ మైగ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతున్నది.

కొలువులు కోల్పోయిన కార్పొరేట్ ఉద్యోగుల వినిమయ శక్తి తగ్గిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందిపై ప్రభావం పడుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది.

ఇందుకోసం నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ, కొత్త ఉద్యోగాల సృష్టి, విదేశాల నుంచి వచ్చిన నిపుణుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలి. ఏఐ సాంకేతికతను పూర్తిగా విస్మరించలేం. కాబట్టి, ఏఐతో కలిసి ప్రయాణిస్తూనే కొత్త ఉద్యోగాల సృష్టి దిశగా ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.