పర్యావరణహిత సంచి!
నేడు ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం :
కాగితపు సంచుల చరిత్ర 19వ శతాబ్దానికి చెందినది. 1852లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వీటిని మొదటిసారిగా తయారు చేశారు. పెన్సిల్వేనియాకు చెందిన ఫ్రాన్సిస్ వోల్ వీటిని ఆవిష్కరించారు. ఫ్రాన్సిస్ వోల్ పేపర్ బ్యాగ్ తయారీ యంత్రాన్ని రూపొందించారు. దీంతో కాగితపు సంచుల తయారీ వేగవంతమై, వాటి వినియోగం విస్తృతంగా పెరిగింది. అయితే ప్రారంభంలో తయారైన కాగితపు సంచులు కవర్ల మాదిరిగా ఉండేవి.
తర్వాత 1868లో అమెరికాకు చెందిన మార్గరెట్ నైట్ అడుగుభాగం సమతలంగా ఉండే ఫ్లాట్-బాటమ్ పేపర్ బ్యాగ్ రూపొందించారు. దీని వల్ల సంచులు నిలబడగలిగేలా మారి, వస్తువులను ఉంచడం, మోయడం మరింత సులభమైంది. అందువల్ల మార్గరెట్ నైట్‌ను కాగితపు సంచుల తల్లి అని కూడా పిలుస్తారు. కాగితపు సంచుల ఆవిష్కరణ మానవ జీవనంలో ఒక ముఖ్యమైన మార్పునకు నాంది పలికింది.
నేడు ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కాగితపు సంచులు మళ్లీ పర్యావరణహిత ప్రత్యామ్నాయంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రకృతికి హాని చేయని ప్రత్యామ్నాయాల అవసరం ఎంతో పెరిగింది. అలాంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాల్లో కాగిత సంచులు ముఖ్యమైనవి.
ఈ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూలై 12న కాగితపు సంచుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి, కాగితపు సంచులను ఎక్కువగా ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం. ప్లాస్టిక్ సంచులు వాడిన తర్వాత పర్యావరణంలో చాలా కాలం అలాగే ఉండిపోతాయి. అవి సహజంగా కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది.
దీనికి విరుద్ధంగా కాగిత సంచులు బయోడిగ్రేడబుల్ కావడం వల్ల ప్రకృతిలో సులభంగా కలిసిపోతాయి. ప్లాస్టిక్ సంచులు మన జీవితంలో సౌకర్యాన్ని కలిగించినప్పటికీ, అవి పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్ సంచులు కాలువలు, నదులు, సముద్రాల్లో చేరి జలచరాల జీవనానికి ప్రమాదం కలిగిస్తాయి. పశువులు, పక్షులు ప్లాస్టిక్‌ను ఆహారంగా పొరబడి తినడం వల్ల వాటి ప్రాణాలకు హాని కలుగుతుంది.
ప్లాస్టిక్‌ను కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదలై మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల పట్టణాల్లో చెత్త నిర్వహణ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కాగితపు సంచులు పర్యావరణహితమైనవి మాత్రమే కాకుండా, అనేక విధాలుగా ఉపయోగకరమైనవి కూడా. ఇవి మట్టిలో త్వరగా కలిసిపోతాయి. అందువల్ల అవి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
కాగితాన్ని రీసైకిల్ చేసి మళ్లీ కొత్త ఉత్పత్తుల తయారీలో ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ సంచుల్లో ఉండే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. కాగితపు సంచుల తయారీ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఇవి సాధారణంగా చెట్ల నుంచి తయారయ్యే కాగితం లేదా రీసైకిల్ చేసిన కాగితంతో తయారవుతాయి. నేడు అనేక వాణిజ్య కేంద్రాల్లో వీటిని వినియోగిస్తుండటం పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి సంకేతం.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్-యూజ్ ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధించారు. అలాగే పర్యావరణహిత సంచుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కాగితపు సంచుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
విద్యార్థులకు వీటి తయారీపై శిక్షణ ఇచ్చి పర్యావరణ పరిరక్షణలో వారి పాత్రను పెంపొందిస్తున్నాయి. చిన్న చిన్న మార్పులే సమాజంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, కాగితపు సంచులను ఉపయోగించడం ప్రారంభిస్తే పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఆళవందార్ వేణు మాధవ్
వ్యాసకర్త సెల్: 8686051752






