21-02-2026 01:55:14 AM
జయశంకర్ భూపాలపల్లి(మహబూబాబాద్)/మంథని, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసి రూ.5 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కోర్టు కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతుకు చెందిన భూమికి సంబంధించిన కేసు కోర్టులో తీర్పు అనుకూలంగా రాగా, కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ కోసం అవసరమైన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి కోర్టు స్టెనోగ్రాఫర్ సాయి చరణ్ రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని రూ.5 వేలు ఇస్తానని రైతు చెప్పడంతో అందుకు అంగీకరించగా.. లంచం ఇవ్వడానికి ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రైతు నుంచి కోర్టు అటెండర్లు రజిత, సునీత ద్వారా రూ.5 వేలు తీసుకొని సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు కోర్టు సిబ్బందిని పట్టుకున్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఎస్‌ఐలు ఎల్ రాజు, ఎస్ రాజు, ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
మంథనిలో ఏసీబీ దాడులు
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏబీసీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి కన్నూరి రవి నుంచి ప్లాట్ రిజిస్టర్ కోసం రూ.16,500 లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ కాసల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రసీదులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.