21-02-2026 01:59:16 AM
గిట్టుబాటు లేక కొత్తగూడలో ఉచితంగా పంపిణీ చేసిన రైతులు
మహబూబాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రెండు రూపాయలకు కిలో టమా టాలు విక్రయించడానికి మనసు ఒప్పుకోక.. గిట్టుబాటు ధర రాకపోవడంతో ముగ్గురు రైతులు తాము పండించిన టమాటాలను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వారాంతపు సంతలో శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన సారయ్య, మోహన్, సుందర్ అనే రైతులు 50 ట్రేల టమాటాలను ట్రాక్టర్‌లో వారాంతపు సంతలో విక్రయించడానికి తెచ్చారు.
సంతకు పెద్ద మొ త్తంలో టమాటాలు విక్రయానికి రావడం వల్ల వ్యాపారులు పూర్తిగా ధర తగ్గించి రెం డు రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. రైతులు తెచ్చిన టమాటాలను కొనే నాధుడే కరువయ్యాడు. దీనితో ఆ టమా టాలను తిరిగి తీసుకెళ్లలేక.. పారబోయలేక తల్లడిల్లిపోయిన రైతులు అక్కడికి వచ్చిన ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. మూడు ఎకరాల్లో వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అష్ట కష్టాలు పడి పండించిన టమా టా పంటకు ఆశించిన దిగుబడి లభించకపోవడంతో దిక్కుతోచని రైతులు ఇలా ఉచితంగా పంచిపెట్టడం ప్రతి ఒక్కరిని కలచివేసింది.