ఒడిశాలో అవినీతి గని
కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు.. 4 కోట్లు
- 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గనులశాఖ అధికారి మోహంతి
- ట్రాలీ బ్యాగులు, అల్మరాల నిండా డబ్బు
- రాష్ట్రంలో ప్రభుత్వ అధికారి నుంచి పెద్దమొత్తంలో అవినీతి నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి
- అవినీతి కేసులో బయటపడిన ఒడిశా మైనింగ్ ఆఫీసర్ బండారం
- ఒడిశాలో ఇంత పెద్దమొత్తం నగదుతో పట్టుబడిన మొదటి ప్రభుత్వ అధికారి
భువనేశ్వర్, ఫిబ్రవరి 25: ఒడిశా విజిలెన్స్ అధికారులు పన్నిన వలకు ‘మైనింగ్’ అవినీతి తిమింగళం చిక్కింది. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబ్రత మోహంతి ఇంటి సోదా చేయగా, కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. అల్మారాలు, ట్రావెల్ బ్యాగులు, బీరువాలు.. ఎక్కడ వెతికినా నోట్ల కట్టలే కనిపించాయి.
అలా.. విజిలెన్స్ అధికారులు మొత్తంగా ఆఫీసర్ ఇంటి నుంచి సుమారు 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో నగదు దొరకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ సర్కిల్‌లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మహంతి ఇంట్లో బుధవారం తనిఖీలు చేసిన విజిలెన్స్ శాఖ ఆశ్చర్యానికి గురైంది.
ఆ ఇంటి నుంచి సుమారు 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. అయితే మహంతి హంతిని మంగళవారం ట్రాప్ చేశారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్స్ కోసం అతను 30 వేల లంచం తీసుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
పాటియాలోని శ్రీవిహార్‌లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌తో పాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బు దొరికింది. ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో కోట్లకొద్దీ కరెన్సీ కట్టలను దాచినట్లు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్‌లో నుంచి రెండు లక్షల నగదు సీజ్ చేశారు.
భువనేశ్వర్‌లో ఉన్న పహలాలోని రెండు అంతస్తుల బిల్డింగ్‌తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ఒక సాధారణ లంచం కేసు అనుకున్నాం. కానీ, లంచం కేసులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందని ఊహించలేదు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకటం ఇదే మొదటి సారి’ అని తెలిపారు.




