26 February, 2026 | 3:19 AM

న్యాయ వ్యవస్థపై దాడి సహించం

26-02-2026 01:32 AM

పాఠ్య పుస్తకాల్లో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠం ఏంటి?

  1. కించపరిస్తే చూస్తూ ఊరుకోవాలా?
  2. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
  3. ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
  4. దీనిని న్యాయ వ్యవస్థపై టార్గెట్‌గా అభివర్ణించిన కోర్టు
  5. రాజకీయ నాయకులు, మంత్రులు, దర్యాప్తు సంస్థల్లో ఉన్న అవినీతిని ఎందుకు ప్రస్తావించలేదు: జస్టిస్ బాగ్చీ 
  6. సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ‘పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందంటూ పాఠం చేర్చడం ఏమిటి? చిన్నారుల మనసుల్లో ఇలాంటి ఆలోచనలు ఎలా నాటు తారు? న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా? రాజకీయ నాయకులు, మంత్రులు, దర్యాప్తు సం స్థల్లో ఉన్న అవినీతిని పుస్తకాల్లో ఎందుకు ప్రస్తావించలేదు?’ అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తీరుపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంస్థ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని పేర్కొంది. న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తే మేము ఎవ్వరినీ సహించబోమని సీజేఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అన్నారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలోనే తేలుస్తామని చెప్పారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి, వేగవంతం చేసింది. 8వ తరగతి సామాజిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని కొత్తగా చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తులందరూ ఈ పాఠం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ అంశాలను తాము గమనించామన్నారు. ఇది వ్యవస్థపై కావాలని చేస్తున్న దాడిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఈ వివాదాన్ని బుధవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు, మంత్రులు, దర్యాప్తు సంస్థల్లో ఉన్న అవినీతిని పుస్తకాల్లో ఎందుకు ప్రస్తావించలేదని వారు ప్రశ్నించారు.

కేవలం న్యాయవ్యవస్థనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర వ్యవస్థల అవినీతిని ఎందుకు కప్పిపుచ్చుతున్నారని కపిల్ సిబల్ నిలదీశారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల మనసులు చాలా సున్నితంగా ఉంటాయని న్యాయవాదులు వాదించారు. వారికి పాలనా వ్యవస్థల పట్ల గౌరవం పెంచాలే తప్ప, ఇలాంటి పాఠంతో అయోమయానికి గురి చేయకూడదని కోరారు.

న్యాయవ్యవస్థ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతుందో వివరించడంలో ఎన్సీఈఆర్టీ విఫలమైందని మండిపడ్డారు. కేశవానంద భారతి వంటి చారిత్రాత్మక తీర్పుల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. తాము ఈ విషయంలో మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలోనే తేలుస్తామని చెప్పారు. ఈ సుమోటో కేసు విచారణను అత్యున్నత న్యాయస్థానం వేగవంతం చేయనుంది.

పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆ విధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి ఉండాల్సిందని కేంద్రం అభిప్రాయపడినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకం

గతంలో పాఠ్యపుస్తకాలు కోర్టుల పనితీరు, నిర్మాణానికే పరిమితమయ్యేవి. ఇప్పుడు నేరుగా అవినీతి ఆరోపణలు, లక్షల సంఖ్యలో ఉన్న కేసుల పెండింగ్ గురించి వివరించడం వివాదాస్పదమైంది. ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థపై పాఠం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉందని జస్టిస్ బాగ్చీ అభిప్రాయపడ్డారు.

న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళి గురించి కూడా పుస్తకంలో ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాజీ న్యాయమూర్తుల వ్యాఖ్యలను వక్రీకరించి పాఠాల్లో చేర్చారని కొందరు న్యాయవాదులు ఆరోపించారు. వ్యవస్థలో పారదర్శకత అవసరమే అయినా, దాన్ని పాఠశాల స్థాయిలోనే తప్పుడు కోణంలో చూపడం ప్రమాదకరమని హెచ్చరించారు. 

న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తే మేము సహించం: సీజేఐ

‘న్యాయవ్యవస్థ సమగ్రతను కించపరచడానికి, ప్రశ్నించడానికి నేను ఎవరినీ అనుమతించను’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. ఈ విషయం ఏ స్థాయికి చేరినా చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. అంతేకాదు న్యాయ సంస్థపై ఎటువంటి దాడిని కూడా కోర్టు అనుమతించదని తెలిపారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా లోతుగా పాతుకుపోయిన దాడిగా కనిపిస్తుందని, న్యాయ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ‘మేము ఎవరినీ అనుమతించం’ అని సీజేఐ అన్నారు.

ఇంతలో, మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సిం ఘ్వీ వాదించారు. ఇది ఒక సంస్థను ఒంటరిగా చేస్తున్నట్లుగా కనిపిస్తోందని, అవినీతి న్యాయవ్యవస్థలో మాత్రమే ఉన్నట్లు ఉందని, రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు లేదా మరెవరి గురించి కూడా ఎటువంటి సమాచారం లేదని సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు.