సర్కార్ ఆఫీసుల్లో అవినీతి జలగలు
ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
పట్టుబడిన వారిలో తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్, జీపీ సెక్రటరీ
హనుమకొండ/ రాజన్న సిరిసిల్ల/ రాజేంద్రనగర్, మే 20 (విజయక్రాంతి): భూ రిజిస్ట్రేషన్‌కు రూ.30 వేలు డిమాండ్ చేసిన కమలాపూర్ తహసీల్దారు మాధవీలత నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ మండలం కన్నూరుకు చెందిన కసరబోయిన గోపాల్ వారసత్వంగా సంక్రమించిన భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇటీవల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్ రూ. 30,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఏసీబీ పథకం రచించారు. గోపాల్ ఆదివారం తహీసల్దార్‌కు కాల్ చేసి కొంత నగదు ఇస్తానని చెప్పాడు.
గోపాల్ సోమవారం సాయంత్రం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ రూ.4 వేలు, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.వెయ్యి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. తహసీ ల్దారుపై గతంలోనే అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిస్తున్నది.
సిరిసిల్ల కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్..
లంచాల దొంగ పట్టుబడ్డాడు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి అడ్డం గా దొరికిపోయాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జోగి నపల్లి భాస్కర్‌రావు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్ రూ.4.5లక్షలతో శ్మశానవాటిక కాంపౌండ్ వాల్ కట్టించాడు.
దానికి సంబంధించిన బిల్లులు వెంకటేశ్‌కు రావాల్సి ఉంది. ఆ బిల్లుల కోసం నాలుగు నెలలుగా తిరుగుతున్నా విడుదల కావడం లేదు. చివరకు సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్‌రావును కాంట్రాక్టర్ వెంకటేశ్ సంప్రదించగా రూ.8వేలు డిమాండ్ చేశాడు. అప్పులు తెచ్చి పనులు చేస్తే లంచాలు ఎందుకు ఇవ్వాలనుకున్నాడో ఏమో వెంకటేశ్ నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పాడు. ఏసీబీ సూచన మేరకు సోమవారం రూ. 7వేలు తీసుకెళ్లి సీనియర్ అసిస్టెంట్ భాస్కర్‌రావుకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భాస్కర్‌రావు వేలిముద్రలను, నోట్లపై ఉన్న వేలిముద్రలను సేకరించి, భాస్కర్‌రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నానాజీపూర్‌లో జీపీ సెక్రటరీ, కారోబార్..
ప్రహరీ, గది నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం నానాజీపూర్ పంచాయతీ కార్యదర్శి రాధిక రూ.65 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి బాధితుడి నుంచి పంచాయతీ కార్యదర్శి సొమ్ము తీసుకుంటుండడగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బర్కత్ అలీకి నానాజీపూ ర్‌లో 500 గజాల స్థలం ఉంది.
ఆ స్థలంలో ప్రహరీతోపాటు చిన్నగది నిర్మించేందుకు పంచాయతీ కార్యదర్శి రాధికను అనుమతులు కోరాడు. ఆమె అనుమతులకు రూ. 65 వేలు లంచం డిమాండ్ చేసింది. బాధితుడు సొమ్ము అంత ఇచ్చుకోలేనని చెప్పి రూ.30 వేలకు పంచాయతీ కార్యదర్శిని ఒప్పించాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడు సోమవారం పంచాయతీ కార్యదర్శికి రూ.30 వేల సొమ్ము ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెతో పాటు అవినీతితో ప్రమే యం ఉన్న కారోబార్ బాల్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో అప్పగించారు.






